హైదరాబాద్: నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం నుంచి అదనంగా 21 ఎంజీడీల నీటిని సరఫరా చేసేందుకు హైదరాబాద్ జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా షేక్‌పేట్ ఫిల్టర్ బెడ్స్‌లో 21 ఎంజీడీల సామర్థ్యంతో నూతన నీటి శుద్ధి కేంద్రం (డబ్ల్యూటీపీ) నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి, హెచ్‌జీసీఎల్ ఎండీ ఉపేందర్ రెడ్డితో కలిసి ఎంజీఐటీ నుంచి పుప్పాలగూడ బీఆర్సీ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సుమారు ఆరు కిలోమీటర్ల మేర కాలినడకన పరిశీలించి ప్రతిపాదిత 120 అడుగుల రహదారి నిర్మాణం, 1200 ఎంఎం, 1300 ఎంఎం వ్యాసం కలిగిన భారీ తాగునీటి పైపులైన్ల ఏర్పాటుపై సమీక్షించారు.
పది కిలోమీటర్ల మేర పైపులైన్ల ఏర్పాటుకు సమగ్ర డిజైన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రైల్వే క్రాసింగ్‌లు, టన్నెలింగ్, అటవీ అనుమతులు, భూసేకరణ, విద్యుత్ స్తంభాలు, ఇతర సాంకేతిక అడ్డంకులను ముందుగానే గుర్తించి పరిష్కరించాలన్నారు. రహదారి నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా పైపులైన్ల ఏర్పాటుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఈ పర్యటనలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎం బలరామ రాజు, జీఎంలు సంతోష్, నరహరి, హెచ్‌జీసీఎల్ సీఈ వెంకటేశ్వర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!