హైదరాబాద్: కుటుంబ సభ్యులు తన ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతపు పెళ్లి చేయాలని చూడటంతో హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి ఇంటి నుంచి బయటకు వచ్చి, తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంది. కిస్మత్‌పూర్‌లోని సన్‌సిటీ (హైదర్షాకోట్) ప్రాంతానికి చెందిన ఆఫ్రీన్ షరీఫ్ వివరాల ప్రకారం అప్పటికే వివాహమైన తన దూరపు మేనమామ సయ్యద్ అథర్ను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అతడికి మొదటి భార్యతో విడాకులు ఇప్పిస్తామని తల్లి నచ్చజెప్పే ప్రయత్నం చేసిందని ఆఫ్రీన్ ఆరోపించింది.
ఐదు నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా బాబానగర్‌కు చెందిన సయ్యద్ అజాన్ అలీతో తనకు పరిచయం ఏర్పడిందని, అతడిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చూద్దామని కుటుంబ సభ్యులు దాటవేశారని ఆఫ్రీన్ తెలిపింది. అయితే మేనమామను పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టడంతో పాటు, తాను నిరాకరించడంతో శారీరకంగా హాని తలపెడతామని బెదిరించారని ఆమె పేర్కొంది."నేను ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి బయటకు వచ్చి సయ్యద్ అజాన్ అలీని వివాహం చేసుకున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు" అని ఆఫ్రీన్ స్పష్టం చేసింది. అనంతరం ఈ జంట కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ వివాహానికి సంబంధించి వాంగ్మూలం నమోదు చేసి, బంధువుల నివాసంలో నికాహ్ చేసుకున్నారు. తమకు ఏదైనా హాని జరిగితే తన కుటుంబ సభ్యులదే బాధ్యత అని ఆమె పేర్కొంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!