హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో సమాచార హక్కు చట్టం (RTI Act–2005) సమర్థవంతంగా అమలైనప్పుడే అభివృద్ధి కార్యక్రమాల్లో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతాయని, అవినీతికి అవకాశం తగ్గుతుందని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ మొహసీనా పర్వీన్ అన్నారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో నవంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆర్టీఐ చట్టంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కన్సల్టెన్సీ లీలావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శనివారం రాష్ట్ర సమాచార కమిషనర్ మొహసీనా పర్వీన్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ ఇచ్చారు.
శిక్షణలో భాగంగా ఆర్టీఐ చట్టం–2005లోని కీలక నిబంధనలు, ప్రజా సమాచార అధికారుల (PIO) విధులు, బాధ్యతలు, పౌరులు సమాచార హక్కును ఎలా వినియోగించుకోవాలి, సమాచారాన్ని అందించే విధానం, మొదటి అప్పీల్, రెండో అప్పీల్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అర్హులైన దరఖాస్తుదారులకు చట్ట ప్రకారం నిర్ణీత గడువులో సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రతినిధులు పాల్గొన్నారు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తరఫున మహమ్మద్ రాజమ్మద్, స్వప్న రాగి, వంశీకృష్ణ, శరత్ కుమార్, సుప్రియ పాల్గొని ఆర్టీఐ చట్టంలోని వివిధ అంశాలపై అవగాహన పొందారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!