ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా తండ్రి మరణిస్తే.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించేందుకు కారుణ్య నియామకం కోరే వివాహిత కుమార్తెకు కేవలం పెళ్లయిందనే కారణంతో కారుణ్య నియామకాన్ని నిరాకరించలేరని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అసిస్టెంట్ లైన్మేన్గా పనిచేస్తూ 2014లో తండ్రి మరణించడంతో కారుణ్య నియామకం కోసం 11 ఏళ్లుగా పోరాడుతున్న కె.జ్యోతికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ను ఆదేశించింది. నిబంధనల ప్రకారం వర్తించే అన్ని ప్రయోజనాలతో ఆమెకు నియామకం కల్పించాలని పేర్కొంది. ఎస్పీడీసీఎల్లో అసిస్టెంట్ లైన్మేన్గా పనిచేస్తున్న కె.రామకృష్ణారెడ్డి 2014లో మరణించారు. ఆయన కుటుంబ బాధ్యతల నేపథ్యంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కుమార్తె కె.జ్యోతి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆమెకు వివాహం జరిగిందనే కారణంతో అధికారులు ఆ అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జ్యోతి హైకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి మరణించిన తర్వాత కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉద్యోగం కోరానని, కేవలం వివాహిత అనే కారణంతో తనకు అవకాశం నిరాకరించడం సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ బుధవారం తీర్పు వెలువరించారు. రామకృష్ణారెడ్డి మరణించే సమయానికి ఆయన భార్య, కుమారుడు, కుమార్తె వారసులుగా ఉన్నారని న్యాయస్థానం గుర్తించింది. కుమారుడు ఉన్నత విద్య కోసం లండన్లో ఉంటూ ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి నిరాకరించారని, కుటుంబ సభ్యులందరి అంగీకారంతో జ్యోతి కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. కుటుంబంలో కుమార్తెకు, కుమారుడికి మధ్య కేవలం లింగం, వివాహ స్థితి ఆధారంగా వివక్ష చూపడాన్ని సమర్థించలేమని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. కె.జ్యోతికి వర్తించే అన్ని ప్రయోజనాలతో కారుణ్య నియామకం కల్పించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఎస్పీడీసీఎల్ను ఆదేశించింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!