ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న నమిత్ మల్హోత్రా నిర్మాణ చిత్రం ‘రామాయణ’ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన మైలురాయిని అందుకుంది. 99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్) లోని ‘బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్’ విభాగంలో తదుపరి దశకు ఎంపికైన టాప్-20 చిత్రాల జాబితాలో ‘రామాయణ’ చోటు దక్కించుకుంది.అకాడమీ విజువల్ ఎఫెక్ట్స్ విభాగం తదుపరి రౌండ్ కోసం ఈ 20 సినిమాలను ఎంపిక చేసింది. అకాడమీ ఇంకా అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనప్పటికీ, ప్రముఖ అంతర్జాతీయ వినోద మీడియా పోర్టల్ ‘వెరైటీ’ ఈ చిత్రాల పేర్లను ధృవీకరించింది.
హాలీవుడ్ దిగ్గజ చిత్రాలతో పోటీ:
రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులో నిలవడం భారతీయ విజువల్ ఎఫెక్ట్స్ సాంకేతికతకు దక్కిన గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ జాబితాలో అవెంజర్స్: డూమ్స్‌డే, డ్యూన్: పార్ట్ త్రీ, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహిస్తున్న ది ఒడిస్సీ వంటి భారీ హాలీవుడ్ చిత్రాల సరసన ‘రామాయణ’ నిలిచింది. వీటితో పాటు ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, గాడ్జిల్లా మైనస్ జీరో, స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే, సూపర్‌గర్ల్, మోనా, జుమాంజీ: ఓపెన్ వరల్డ్, ది మాండలోరియన్ అండ్ గ్రోగు వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ‘రామాయణ’తో సహా సోనీ పిక్చర్స్ సంస్థకు మూడు ఎంట్రీలు దక్కడం విశేషం.
తదుపరి ఓటింగ్ ఎప్పుడంటే?
ఆస్కార్ తదుపరి రౌండ్ ఓటింగ్ డిసెంబర్ 7 నుండి 11 వరకు జరగనుండగా, తుది 10 చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను డిసెంబర్ 15న ప్రకటిస్తారు. ఇక తుది ఆస్కార్ నామినేషన్లను 2027 జనవరి 21న వెల్లడించనున్నారు. మరి తదుపరి ఓటింగ్ దశలోనూ ‘రామాయణ’ సత్తా చాటి తుది జాబితాలో నిలుస్తుందో లేదో చూడాలి.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!