హైదరాబాద్ నగర శివారు బాచుపల్లిలో మంగళవారం (నవంబర్ 24) మురుగునీటి శుద్ధి కేంద్రం ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది. బుధవారం (నవంబర్ 25) ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, దీనిపై సమగ్ర నివేదికలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, ఎస్టీపీ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా హెచ్చరించింది. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ బుధవారం బాచుపల్లి ఏపీఆర్ ఎన్‌క్లేవ్‌లోని 'దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్' వద్ద ఉన్న ప్రమాద స్థలాన్ని సందర్శించారు. అక్కడి హైడ్రా మరియు మున్సిపల్ అధికారుల నుండి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు తమ ఎస్టీపీల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించామంటే తమ బాధ్యత తీరిపోయిందని భావించకూడదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఒకరి తర్వాత ఒకరు ఎస్టీపీ ట్యాంక్‌లోకి దిగి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియమ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు, తగిన మార్గదర్శకాలు ఇచ్చేందుకు త్వరలోనే ఎస్టీపీ ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

డిసెంబర్ 22 లోగా నివేదిక ఇవ్వాలన్న TGHRC:

జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ కార్యదర్శి నుండి వివరణాత్మక నివేదికను కోరింది. అలాగే కార్మికుల మృతికి దారితీసిన పరిస్థితులు, విచారణ వివరాలు, బాధిత కుటుంబాలకు అందించిన లేదా ప్రతిపాదించిన ఎక్స్-గ్రేషియా పరిహారం మరియు ఇతర సహాయక చర్యలపై డిసెంబర్ 22 లోగా నివేదిక సమర్పించాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.