హైదరాబాద్: తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ భవిష్యత్తు క్రీడలకు బలమైన పునాదిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ క్రీడల ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

డిసెంబర్ 11న ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవం, 22న గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరమంతా క్రీడా స్ఫూర్తి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలని, స్టేడియంల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. పనులపై విజిలెన్స్ నిఘా ఉండాలని సూచించారు.

క్రీడల నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. జిల్లాల వారీగా పర్యవేక్షణ కోసం మంత్రులను ఇన్‌చార్జిలుగా నియమించారు. హైదరాబాద్‌కు పొన్నం ప్రభాకర్, రంగారెడ్డికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహబూబ్‌నగర్‌కు జూపల్లి కృష్ణారావు, వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్‌కు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఖమ్మంకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్‌కు ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిని బాధ్యులుగా నియమించారు.

కర్రసాముకు జాతీయ స్థాయిలో గుర్తింపు

తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ అయిన కర్రసామును తొలిసారిగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ప్రదర్శన క్రీడగా ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. జాతీయ వేదికపై కర్రసాముకు గుర్తింపు కల్పించడం ద్వారా సంప్రదాయ క్రీడకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.

రూ.203 కోట్లతో క్రీడల నిర్వహణ

ఈ క్రీడల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రూ.21 కోట్లు కేటాయించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియంల అభివృద్ధి, అత్యాధునిక క్రీడా పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే 14 స్టేడియాల్లో పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఆరు స్టేడియాల్లో ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

27 క్రీడల్లో తెలంగాణ క్రీడాకారుల సన్నద్ధత

ఖేలో ఇండియాలో భాగంగా 27 క్రీడలకు సంబంధించి 1,334 మంది తెలంగాణ క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రం తరఫున పాల్గొనే 861 మంది క్రీడాకారులు, కోచ్‌లకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రీడా ప్రాంగణాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.