ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో రైల్వేకు సంబంధించిన వివిధ సమస్యలు, అభివృద్ధి పనుల పరిష్కారం కోసం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. సికింద్రాబాద్‌లోని రైల్వే ప్రధాన కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమక్షంలో జరిగిన సమావేశంలో జిల్లాలోని రైల్వే సమస్యలను ఎమ్మెల్యే వివరించారు.

కొత్త ఆర్‌యూబీలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి విజ్ఞప్తి:

రైతులు తమ వ్యవసాయ భూములకు సులభంగా వెళ్లేందుకు వీలుగా భోరజ్, గిమ్మా గ్రామాల సమీపంలో, అలాగే ఆదిలాబాద్ పట్టణ పరిధిలో మరోచోట కొత్త రోడ్ అండర్ బ్రిడ్జిలు (RUB) మంజూరు చేసి నిర్మించాలని ఎమ్మెల్యే కోరారు. అదేవిధంగా మహాలక్ష్మీవాడ ఆర్‌యూబీ సమీపం నుంచి వ్యవసాయ భూముల వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాటిగూడ వరకు ద్విచక్ర వాహనాలు, పాదచారుల సౌకర్యార్థం లైట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పెండింగ్ పనులపై జీఎం సానుకూల స్పందన:

ఆదిలాబాద్ పట్టణంలో కొనసాగుతున్న ఆర్వోబీ (ROB), ఆర్‌యూబీ నిర్మాణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జీఎం వ్యక్తిగత చొరవ తీసుకుని నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పాయల్ శంకర్ కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించి, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులకు సహకరిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రైల్వే జీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా, రైతు ప్రయోజనాల కోసం ఈ పనులు పూర్తయ్యే వరకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.