తెలంగాణలో RR ట్యాక్స్‌ నడుస్తోందని.. ఆర్ఆర్ అంటే రాహుల్‌–రేవంత్‌ ట్యాక్స్‌ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణలో వసూలు చేస్తున్న RR ట్యాక్స్‌ రేవంత్‌ రెడ్డి వద్దకు వెళ్లడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. తెలంగాణను ఢిల్లీ దర్బార్‌కు ఏటీఎంలా మార్చారని అమిత్ షా ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు. చొరబాటుదారులే కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా మారారని, అందుకే ఈ సర్వేను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు.


ఢిల్లీ రాంలీలా మైదానంలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభ ‘ఓటు బచావో’ కోసం కాదని, చొరబాటుదారులను కాపాడే ‘ఘుస్‌పైఠియా బచావో’ సభ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన 'లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో' మహాపాదయాత్ర అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే దేశ భద్రతను పణంగా పెడుతోందని ఆరోపించారు. ప్రధాని కావాలన్నదే రాహుల్ గాంధీ లక్ష్యమని.. తన జీవితంలో ప్రధాని కాలేడని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతి చొరబాటుదారుడి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, దేశం సరిహద్దుల నుంచే శాశ్వతంగా తరిమికొడుతుందని అమిత్ షా గర్జిస్తూ స్పష్టం చేశారు. అంతకుముందు నిజాం కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఎంజే మార్కెట్ వరకు అమిత్ షా స్వయంగా వేలాది మంది కార్యకర్తలతో కలిసి పాదయాత్రను ముందుండి నడిపించారు.