హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు IAS బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఈ సమావేశాన్ని నిర్వహించి పథకం అమలుకు సంబంధించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి గ్రామపంచాయతీతో పాటు ప్రతి మున్సిపల్ వార్డులో ప్రత్యేక నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. పథకానికి అర్హులైన ప్రతి కుటుంబంలోని సభ్యులందరి వివరాలను నమోదు చేయాలని, అర్హులైన ఒక్కరూ కూడా మినహాయించబడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల ద్వారా అమలవుతున్న వ్యక్తిగత బీమా పథకాలను సమన్వయం చేసి, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.