భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రధాన రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పార్శిల్ విభాగానికి సమీపంలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మరియు రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఫుడ్ స్టాల్‌లోని సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్ పైకప్పుకు కొంత నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు ధృవీకరించారు.