హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నేపథ్యంలో ప్రజలకు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన గాలిని అందించే పార్కులు, ప్రజావసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పార్కులు, ఆటస్థలాల కోసం కేటాయించిన భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడాలని అధికారులను కోరారు.
పార్కులు, ప్రజావసరాల స్థలాలు, చెరువులు, నాలాల పరిరక్షణ కోరుతూ సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 51 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్ పరిశీలించి, వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.
ప్రధాన ఫిర్యాదులు ఇవే..
మారుతీనగర్‌లో 667 గజాల స్థలంపై ఆక్రమణ యత్నం
రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేటలోని మారుతీనగర్‌లో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. ఈ కాలనీకి సంబంధించి ప్రజావసరాల కోసం 667 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ స్థలం ఆక్రమణకు గురవుతోందని మారుతీనగర్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. స్థలంలో గది నిర్మించేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రతిసారీ తాము అడ్డుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా స్థలాన్ని హైడ్రా పరిరక్షించాలని, ప్రజావసరాల స్థలంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
కొమిటి కుంట చెరువు, రహదారి ఆక్రమణలపై ఫిర్యాదు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పరిధిలోని కొమిటి కుంట చెరువులో మట్టిపోసి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. చెరువు పక్కనే ఉన్న 50 అడుగుల రహదారిని ఆక్రమించడంతో అది 30 అడుగులకు కుదించుకుపోయిందని తెలిపారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. చెరువు, రహదారి ఆక్రమణలను తొలగించి, చెరువు ఎఫ్టీఎల్ హద్దుల ప్రకారం కంచె ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రశాంత్‌నగర్‌లో పార్కు స్థలం పరిరక్షించాలని వినతి
మియాపూర్ ప్రశాంత్‌నగర్ కాలనీలో ప్రజావసరాల కోసం కేటాయించిన పలు ఖాళీ స్థలాలు, పార్కులను హైడ్రా గతంలో కాపాడిందని స్థానికులు తెలిపారు. అయితే మరో ఖాళీ స్థలంలో ఉన్న నిర్మాణాన్ని కొందరు మాజీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కార్యాలయంగా వినియోగించుకుంటూ, ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రశాంత్‌నగర్ రెగ్యులరైజేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఫిర్యాదు చేసింది. స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి, అనధికార నిర్మాణాన్ని తొలగించాలని కోరింది.
తుర్కయంజాల్‌లో రోడ్లు, పార్కు స్థలాలకు గండం
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 338లో రోడ్లు, పార్కు స్థలాలను ఆక్రమిస్తూ ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో మున్సిపల్ అధికారులు పరిశీలించి గోడలను తొలగించినప్పటికీ, మళ్లీ అదే ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని కోరారు.
శాస్త్రిపురం కాలనీలో 6,500 గజాల ఆటస్థలంపై ఆందోళన
రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లి గ్రామంలోని శాస్త్రిపురం హౌసింగ్ కాలనీలో సుమారు 6,500 చదరపు గజాల ఆటస్థలాన్ని హైడ్రా గతంలో కాపాడిందని స్థానికులు తెలిపారు. అయితే మళ్లీ ఆ స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని పరిరక్షించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, కొందరు జేసీబీతో భూమిని చదును చేయడంతో పాటు బోర్వెల్ తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే పరిశీలించి ఆటస్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
కొత్తకుంట చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు
శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని కొత్తకుంట చెరువును ఆక్రమించి భారీ వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 99ను చూపిస్తూ చెరువు ఉన్న సర్వే నంబర్ 100లో ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా చెరువు పరిసరాల్లో కార్ల గ్యారేజీ నిర్వహిస్తూ పరిసరాలను కలుషితం చేస్తున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!