హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఐదుగురు మంత్రులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై సంబంధిత మంత్రుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే మళ్లీ భారీగా ఎన్నికల ఖర్చు భరించాల్సి వస్తుందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయంగా మెరుగైన అవకాశమనే అభిప్రాయంతో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు తన కుమారుడు అరుణ్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహ తన కుమార్తె త్రిషను రాజకీయాల్లోకి పరిచయం చేసి ఎన్నికల బరిలో నిలపాలనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. అయితే జూపల్లి, దామోదర రాజనర్సింహ తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై మంత్రులు ఆలోచిస్తున్నారనే ప్రచారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కూడా పూర్తికాకముందే మంత్రుల రాజకీయ భవిష్యత్తుపై ఇలాంటి చర్చలు మొదలవడం కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.
ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు, ప్రభుత్వ పనితీరు, పార్టీ భవిష్యత్తుపై చర్చ కొనసాగుతుండగా.. మంత్రులు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్తు, వారసుల రాజకీయ అరంగేట్రం, పోటీ చేసే ఎన్నికలపై వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఐదుగురు మంత్రులు నిజంగానే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటారా? లేక ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఊహాగానాలేనా? అనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!