పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాసి అవమానించిన ఇద్దరు విద్యార్థినులపై యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిని బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీ నుంచి ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. అక్టోబర్ 13న స్వామి వివేకానంద ఫొటో ఉన్న పోస్టర్‌ను ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఏర్పాటు చేసింది. అయితే ఇద్దరు మహిళా విద్యార్థులు ఆ పోస్టర్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు రాసినట్లు ఏబీవీపీ ఆరోపించింది. నిష్పక్షపాత విచారణ జరుపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏబీవీపీ విద్యార్థులు యూనివర్సిటీ గేటు బయట నిరసన కూడా చేపట్టారు.
ఈ సంఘటనపై ఒక విచారణ కమిటీని ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇతరుల నుంచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులపై ప్రెసిడెన్సీ యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. వారిద్దరిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది. అలాగే భవిష్యత్తులో ఏ డిగ్రీ ప్రోగ్రామ్‌లోనూ ప్రవేశానికి వారు అర్హులు కారని పేర్కొంది. అయితే బహిష్కరించిన ఆ ఇద్దరు మహిళా స్టూడెంట్స్ వివరాలను ఆ యూనివర్సిటీ వెల్లడించలేదు. మరోవైపు ఈ సంఘటనలో తమ ప్రమేయం ఏమీ లేదని వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) తెలిపింది. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!