మధ్యప్రదేశ్‌లో వరకట్న వేధింపులకు సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి సమయంలో కట్నంగా కారు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి భార్యను వేధించడమే కాకుండా, చివరకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇండోర్‌లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. చందన్ నగర్‌కు చెందిన అమ్రీన్ షేక్‌కు 2022లో ఉజేఫా షేక్‌తో వివాహమైంది. పెళ్లి సమయంలో అమ్రీన్ తండ్రి అల్లుడికి స్కూటీ బహుమతిగా ఇచ్చారు. అయినప్పటికీ తన భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని ఆమె ఆరోపించింది. ముఖ్యంగా పుట్టింటి నుంచి కారు తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ, తరచూ గొడవపడేవాడని, తనపై శారీరకంగా దాడి చేయడంతో పాటు మానసిక వేధింపులకు గురిచేసేవాడని పోలీసులకు వివరించింది. కారు కొనిచ్చే ఆర్థిక స్థోమత తమ కుటుంబానికి లేదని చెప్పినా భర్త వినిపించుకోలేదని బాధితురాలు తెలిపింది. తన డిమాండ్ నెరవేర్చకపోతే కాపురం చేయనని బెదిరించేవాడని, చివరకు ట్రిపుల్ తలాక్ చెప్పి తనను వదిలేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
అమ్రీన్ షేక్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్త ఉజేఫా షేక్‌పై వరకట్న వేధింపులు, ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన చట్టపరమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని అదనపు డీసీపీ రాజేశ్ దండోతియా ధ్రువీకరించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!