ఆర్బీఐ విదేశాల్లో భద్రపరిచిన 165 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తరలించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ బంగారు నిల్వలను భారత్లోనే భద్రపరచడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. 2025 సెప్టెంబర్ నుంచి 2026 సెప్టెంబర్ మధ్య ఈ బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది. ఈ తరలింపుతో దేశీయంగా భద్రపరిచిన బంగారం వాటా 65.4 శాతం నుంచి 84 శాతానికి పెరిగింది. ప్రస్తుతం విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 140.39 టన్నుల బంగారం ఉండగా, భారత్ వద్ద మొత్తం నిల్వలు సుమారు 880.52 టన్నులుగా ఉన్నాయి.
1990లలో తీవ్ర ఆర్థిక సంక్షోభం సమయంలో భారత్ తన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. ఆ రుణాన్ని 1991 నవంబర్లోనే తిరిగి చెల్లించినప్పటికీ, అంతర్జాతీయ లావాదేవీలు, విదేశీ కరెన్సీ మార్పిడికి అనుకూలంగా ఉండేందుకు కొంత బంగారాన్ని విదేశాల్లోనే ఉంచింది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ఆస్తులపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు ఇతర దేశాలను అప్రమత్తం చేశాయి. విదేశాల్లో ఉన్న జాతీయ ఆస్తుల భద్రతపై అనిశ్చితి నెలకొనే అవకాశం ఉండటంతో బంగారు నిల్వలను స్వదేశంలో పెంచుకోవాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, సుమారు 881 టన్నుల బంగారు నిల్వలతో భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేసేందుకు బంగారు నిల్వలను స్వదేశంలోనే పెంచుకోవడం కీలక చర్యగా భావిస్తున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!