కొండూరు పాఠశాలలో బాల్యవివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాయని యాకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు బాలల భవిష్యత్తుకు ఆటంకంగా మారుతాయని, ముఖ్యంగా బాలికల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు కె. సత్యనారాయణ అధ్యక్షత వహించి, బాల్యవివాహాల నిర్మూలనలో పాఠశాలల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, చట్టాల పట్ల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. రఘు, శ్యాంసుందర్, నాగరాజు, స్వామి, శివకృష్ణ,రాజు, రమ, వీరస్వామి, నరేష్, స్వరూప తదితరులు పాల్గొని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన అంశాలు, బాలల హక్కుల గురించి వివరించారు.బాల్యవివాహాల రహిత సమాజ నిర్మాణమే మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.