హైదరాబాద్: అంబర్‌పేట్‌లోని తెలంగాణ మైనారిటీ బాయ్స్-1 గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఇంచార్జి  ప్రిన్సిపాల్ సంగమేశ్వర్ రావు నిరంకుశంగా వ్యవహరిస్తూ, వారిని మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెలంగాణ స్టేట్ అవుట్‌సోర్సింగ్ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఉద్యోగుల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, విధుల నుంచి సస్పెండ్ చేయాలని జేఏసీ చైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు.

బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పులి లక్ష్మయ్య మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న  నాన్ టీచింగ్ ఉద్యోగులు అయిన  హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, ఆఫీస్ సబార్డినేట్, ఎలక్ట్రీషియన్ తదితర విభాగాలకు చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రిన్సిపాల్ సంగమేశ్వర్ రావు తరచూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులతో గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగిన అధికారి, వారిని చిన్నచూపు చూస్తూ మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదని అన్నారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, ఉద్యోగ భద్రత కోసం జేఏసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గురుకులాల ప్రెసిడెంట్ సురేష్ నాయక్, జనరల్ సెక్రటరీ రాజ్ మహమ్మద్, వీరస్వామి తదితర జేఏసీ నాయకులు పాల్గొని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు తమ సంఘీభావం ప్రకటించారు.