ఆదిలాబాద్: గిరిజన విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల్లో 'AXL – AI' ఆధారిత డిజిటల్ విద్యా కార్యక్రమాన్ని అమలు చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ బోధనా పద్ధతులకు కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్, ఐసీటీ బోధనా పద్ధతులను జోడించి విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా పాఠ్యాంశాలను బోధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి:

ఈ కార్యక్రమం విజయవంతంగా అమలయ్యేందుకు ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ బోధనా పద్ధతులు, AXL–AI ప్లాట్‌ఫామ్ వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఐసీటీ ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన వాతావరణాన్ని బలోపేతం చేయనున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఎఫ్‌ఎల్‌ఎన్ వర్క్‌బుక్స్‌ను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ నిర్వహించడంతో పాటు స్టేట్ రిసోర్స్ పర్సన్స్, ఏసీఎంవోలు, జీసీడీవోల పర్యవేక్షణలో కార్యక్రమాలను చేపట్టనున్నారు. గిరిజన విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా రాణించేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.