ఆదిలాబాద్: జిల్లాలోని ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వాటికి సంబంధించిన అటవీ శాఖ అనుమతులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ అనుమతులను త్వరితగతిన పొంది, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

గిరిజన ఇళ్ల నిర్మాణాలు, చేదబావుల పనులపై సమీక్ష:

పీవీటీజీ కోర్ ప్రాంతాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని, రిజర్వ్ ఫారెస్ట్ (ఆర్‌ఎఫ్‌) పరిధిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన అంశాలను కలెక్టర్ సమీక్షించారు. అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద గిరిజన లబ్ధిదారులకు గృహ నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ (ROFR) పట్టా భూముల్లో లబ్ధిదారుల ఆధ్వర్యంలో చేపడుతున్న పాత చేదబావుల పూడికతీత, కొత్త చేదబావుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్ క్లియరెన్స్‌ల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు:

ఏజెన్సీ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ సంఘాల భవనాల నిర్మాణాలకు ఎదురవుతున్న అటవీ శాఖ అనుమతుల సమస్యలపై అధికారులతో చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, హౌసింగ్, విద్యుత్ శాఖల పరిధిలో పెండింగ్‌లో ఉన్న క్లియరెన్స్‌లను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, అటవీ శాఖ అధికారి సుశాంత్ సుఖదేవ్ బొబాడే, హౌసింగ్ పీడీ శంకర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.