హైదరాబాద్: ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతన బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. వ్యవసాయ శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన తొమ్మిది మంది వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO Grade-II) దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ కె. శరత్ 2026 నవంబర్ 16న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
9 మంది వ్యవసాయ విస్తరణ అధికారులకు అనుకూలంగా తీర్పు.. రూ.13.84 లక్షల బకాయిల చెల్లింపునకు ఆదేశాలు
సూర్యాపేట, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో థర్డ్ పార్టీ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా విధులు నిర్వహించిన తొమ్మిది మంది వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు రావాల్సిన వేతనాలు చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 16, 21, 23లకు విరుద్ధమని పిటిషనర్లు తమ వాదనల్లో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి 2026 అక్టోబర్ 28న సమర్పించిన రాతపూర్వక సమాచారాన్ని ప్రభుత్వ న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. తొమ్మిది మంది ఉద్యోగులకు మొత్తం రూ.13,84,289 వేతన బకాయిలు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. బడ్జెట్ విడుదల, IFMIS పోర్టల్లో ఉద్యోగుల పేర్ల నమోదు, ప్రభుత్వ అనుమతులు పూర్తయిన అనంతరం బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం తరఫున కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, పిటిషనర్లు విధులు నిర్వహించిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. దీంతో రిట్ పిటిషన్ను పరిష్కరించింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!