హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జోనల్ కార్యాలయం కావడంతో కార్యాలయంలోని కీలక రికార్డులు, ప్రభుత్వ పత్రాలు అగ్నికి ఆహుతై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? ఏవైనా కీలక పత్రాలు దగ్ధమయ్యాయా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.