ఆదిలాబాద్: గుడిహత్నూర్ మండల పరిధిలో బెల్ట్ షాపుల నిర్వహణకు అక్రమ అనుమతులు ఇస్తూ, డబ్బులు వసూలు చేస్తున్న ఘటనపై గుడిహత్నూర్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బెల్ట్ షాపు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న ఒకరితో పాటు, అనుమతుల పేరుతో రూ.15,000 వసూలు చేసిన ఆరుగురు వీడీసీ (VDC) సభ్యులు కలిపి మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్ తెలిపారు.

 నిందితుల వివరాలు:

ఈ కేసులో సోలంకి మహేష్ (31), తెలంగే జ్ఞానేశ్వర్ (32), పూరి గజానంద్ (37), బాబు ముండే (49), రాథోడ్ ఏకనాథ్ (45), కడం దిగంబర్ (55), తెలంగ్ నారాయణ (40)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురు వీడీసీ సభ్యులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

 పోలీసుల హెచ్చరిక:

గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు ఎవరైనా పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్ హెచ్చరించారు.