హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలుకు అనుబంధంగా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిసెంబర్ నెలలో టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తొలి దశ మార్గం & వివరాలు:
- మార్గం: ఐటీ కారిడార్‌లో మొదటి దశ కింద కూకట్పల్లి నుంచి రాయదుర్గం, బయోడైవర్సిటీ మీదుగా నాలెడ్జి సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ పాడ్ ట్యాక్సీ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో సుమారు 64 స్టేషన్లను ప్రతిపాదించారు.
- రెండో దశ: తొలి దశ అనుభవాల ఆధారంగా రెండో దశలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి ఈ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు.
- పీపీపీ విధానం: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ మార్గాల్లో ట్రాఫిక్, జనాభా, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. వారం రోజుల్లో ఈ నివేదిక ప్రభుత్వానికి అందనుంది. అనంతరం సర్దుబాటు వ్యయ నిధి, భూకేటాయింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని టెండర్లను ఖరారు చేయనుంది.
సాంకేతికత & భద్రత:
ప్రపంచవ్యాప్తంగా చైనా, అమెరికా, లండన్ (హీత్రూ ఎయిర్‌పోర్టు), నెదర్లాండ్స్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న పాడ్ ట్యాక్సీ సాంకేతికతలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేసింది. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు దాఖలు చేసే సంస్థలే తాము వినియోగించే సాంకేతికత వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఆ సాంకేతికత ప్రయాణికులకు ఏ మేరకు సురక్షితమనే అంశాన్ని అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!