మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం, పౌనూర్ గ్రామానికి చెందిన గిరుగుల బీమయ్య  భూమి విషయంలో న్యాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మహిళా భవనం నిర్మించాలనే ఉద్దేశం ఉంటే గ్రామంలో అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలని, తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న గిరుగుల బీమయ్య భూమిని పరిగణనలోకి తీసుకోకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి మరో  భూమి లేదని, జీవనోపాధికి ఇతర ఆధారాలు కూడా లేవని, ఈ భూమిపైనే తమ కుటుంబ జీవనం ఆధారపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ సమస్యను వివరించగా, సమస్య పరిష్కారానికి ప్రజాపాలన అధికారులకు బాధ్యతలు అప్పగించారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జరగబోయే విచారణలో గ్రామ సర్పంచ్ ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా, వాస్తవాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు. తమకు ఎవరి పట్లా వ్యక్తిగత ద్వేషం లేదని, గిరుగుల బీమయ్య  కుటుంబానికి చెందిన జీవనాధారం, హక్కులు కాపాడుతూ న్యాయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తమ పరిస్థితిని అర్థం చేసుకొని న్యాయం జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.