నాగర్‌కర్నూల్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది కాలంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ప్రజా ప్రభుత్వం 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, కొత్తగా మరో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసి లక్ష ఉద్యోగాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.