ఆదిలాబాద్: మునగ సాగు, మునగ ఆకు పొడి తయారీ యూనిట్లు మరియు సోలార్ డ్రైయింగ్ యూనిట్లపై గిరిజన సహకార సంస్థ (జీసీసీ) డివిజనల్ మేనేజర్, జిల్లా ఉద్యానవన అధికారి గుడిమల్ల సందీప్ కుమార్, జీసీసీ ఉట్నూర్ సీనియర్ మేనేజర్ ఆర్. సంతోష్ కుమార్ రెండు రోజుల క్షేత్ర పర్యటన నిర్వహించారు.
రెండు రోజుల క్షేత్ర పర్యటన వివరాలు:
మొదటి రోజు సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లోని మునగ తోటలు, సోలార్ డ్రైయింగ్, ఆకు పొడి తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించారు. రెండో రోజు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, గండిగూడ, ముచ్చింతల్ ప్రాంతాల్లోని మునగ తోటలు, సోలార్ డ్రైయర్ యూనిట్లను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఆకుల కోత, ఎండబెట్టడం, పొడిగా మార్చడం, గ్రేడింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్, దిగుబడి, నిర్వహణ ఖర్చులు, ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడి కీర దోసకాయ, టమాటో, క్యాప్సికమ్ తోటలను పరిశీలించి డ్రిప్, మల్చింగ్, గ్రీన్ హౌస్, తెగుళ్ల నివారణపై చర్చించారు.
వాణిజ్యపరంగా సాగు చేయాలి - సందీప్ కుమార్:
జిల్లాలో మునగ సాగును ప్రోత్సహించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని గుడిమళ్ల సందీప్ కుమార్ తెలిపారు. కాయలతో పాటు ఆకుల కోసం సాగు చేస్తే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందని చెప్పారు. మార్కెటింగ్ డిమాండ్, ధరలను ముందుగానే తెలుసుకుని వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా చేయాలని, చిన్న తరహా విలువ ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేసుకుంటే ముడి ఉత్పత్తి కంటే 4 నుంచి 5 రెట్లు అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. సూపర్ ఫుడ్‌గా గుర్తింపు ఉన్న మునగ ఆకు పొడికి దేశ, విదేశాల్లో డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు:
ఆదిలాబాద్ జిల్లా, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మునగ సాగుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. జీసీసీ, ఉద్యానవన శాఖ సంయుక్తంగా రైతులకు శిక్షణ ఇచ్చి సోలార్ డ్రైయింగ్, చిన్న తరహా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తాయని, దీనివల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు గిరిజన మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు రాజశేఖర్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!