హైదరాబాద్: పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకుండా త్వరలోనే సమగ్రమైన పాలసీతో సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పౌల్ట్రీ పరిశ్రమాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తామని ప్రకటించారు.

హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు అనుమతులు, భూమి మార్పిడి వంటి అంశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తన దృష్టికి వచ్చిందన్నారు. పట్టణాల్లో బిల్డ్‌నౌ యాప్ ద్వారా అమలు చేస్తున్న సింగిల్ విండో అనుమతుల విధానాన్ని త్వరలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సందర్భంగా పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు తగిన ప్రతిపాదనలతో ముందుకు వస్తే ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, IPEMA అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, అసోసియేషన్ ప్రతినిధులు, జాతీయ, అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.