పీకేఓసీ-2 ప్రాజెక్టులో కన్వేయర్ బెల్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి బొగ్గు ఉత్పత్తిని పెంచాలని సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) ఎం. తిరుమల రావు అధికారులను ఆదేశించారు. మణుగూరు ఏరియాలోని పీకేఓసీ-2 ప్రాజెక్టు కన్వేయర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. బొగ్గు రవాణా సామర్థ్యాన్ని పెంచి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల్లో నాణ్యత, భద్రత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వివిధ విభాగాల సమన్వయంతో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, ఇతర ఉన్నతాధికారులు, ఏఐజేవీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.