నగరంలో బాంబు దాడులు జరుపుతామంటూ వచ్చిన బెదిరింపు ఈమెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. అనుమానిత ప్రాంతాల్లో యాంటీ సబోటేజ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కీలక సంస్థల వద్ద పోలీసుల నిఘాను పెంచారు.

బాంబు బెదిరింపు మెయిల్‌ను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దాని విశ్వసనీయతను పరిశీలించడంతో పాటు, అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.

సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు

బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? ఎవరు పంపించారు? అనే అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈమెయిల్ మూలాలను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. బెదిరింపు నిజమైనదా, ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నమా అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగత్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఎవరూ భయాందోళనలకు గురికావద్దని, ధృవీకరించని వార్తలు, వదంతులను నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, నిరాధార ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.