చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించేందుకు చేపట్టిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా 94.18 శాతం వ్యాక్సినేషన్ నమోదు చేసింది. సబ్-నేషనల్ ఇమ్యునైజేషన్ డే కార్యక్రమంలో భాగంగా తొలిరోజు జిల్లావ్యాప్తంగా 5,22,814 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 5,11,641 మంది చిన్నారులకు టీకాలు అందించారు.

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల చింతల్ బస్తీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC), ఆసిఫ్‌నగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో టీకాల కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. రైలులో ప్రయాణించే కుటుంబాలతో పాటు చిన్నారులకు కూడా పోలియో చుక్కలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని సమీక్షించారు.

జిల్లాలో భారీ ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు 91 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల పరిధిలో 2,626 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, వలస కుటుంబాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులకు టీకాలు అందించేందుకు 38 ట్రాన్సిట్ పాయింట్లు, 91 మొబైల్ బృందాలను అందుబాటులో ఉంచారు. మొత్తం 5,252 బూత్ బృందాలు విధుల్లో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమం కోసం 10,504 మంది బూత్ సిబ్బంది, 152 మంది ట్రాన్సిట్ టీమ్ సభ్యులు, 182 మంది మొబైల్ టీమ్ సభ్యులు, 263 మంది పర్యవేక్షకులను నియమించారు. జిల్లాలో గుర్తించిన 205 హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.