ఆదిలాబాద్:  జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిసెంబరులో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించి బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే డిసెంబర్ 31 వరకు జరుగుతున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో 14–18 ఏళ్ల విద్యార్థులు జూనియర్ రెడ్‌క్రాస్‌లో, 18–30 ఏళ్ల యువత యూత్ రెడ్‌క్రాస్‌లో (www.redcross.cgg.gov.in ద్వారా) సభ్యులుగా చేరేలా విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

నషా ముక్త్ భారత్‌పై పోటీలు - గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు:

‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మాదకద్రవ్యాల అనర్థాలపై పాఠశాలలు, కళాశాలల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. జనవరి 12, 2027న లోక్‌భవన్‌లో గవర్నర్‌తో జరిగే కార్యక్రమంలో వారు పాల్గొనేలా డీఈవో, డీఐఈవోలు చర్యలు తీసుకోవాలన్నారు. సేవా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాసంస్థలకు గవర్నర్ చేతుల మీదుగా ‘రెడ్‌క్రాస్ లోక్‌భవన్ స్వామి వివేకానంద యూత్ అవార్డ్స్–2026’ ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రెడ్‌క్రాస్ పాత భవన మరమ్మతులు, కేటాయించిన స్థల స్వాధీన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.

కలెక్టర్‌కు సన్మానం:

అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆర్. క్రాంతి కుమార్, వైస్ చైర్మన్ మనోహర్, సభ్యులు కె. పార్థసారథి, సంజీవరావు, రాజు, రూపేష్ రెడ్డి, ఉషా విశ్వనాథ్ తదితరులు కలెక్టర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.