తెలంగాణ: తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి-167 వాహనదారులకు మృత్యుమార్గంగా మారుతోంది. గత కొన్ని నెలలుగా ఈ రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దేవరకద్ర మండలం గుర్రంకొండ గేట్ నుంచి మిడ్జిల్ మండలం బోయినపల్లి మధ్య ఉన్న 68 కిలోమీటర్ల పరిధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదాలకు ప్రధాన కారణాలు:


డ్రైవర్ల అలసట, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా ఓవర్‌టేక్ చేయడంతో పాటు రహదారిపై సూచిక బోర్డులు లేకపోవడం, వీధి దీపాల కొరత, సెంట్రల్ డివైడర్లు (మీడియన్లు) లేకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

 

  • ఆరు నెలల క్రితం పెద్దపప్పూర్ వద్ద లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు.
  • చౌదర్‌పల్లికి చెందిన ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మరణించారు.
  • అక్టోబర్ 21న రాణిపేటకు చెందిన శ్రీనివాసులు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందారు.
  • గంగాపూర్‌కు చెందిన ఆర్. రమేశ్ జడ్చర్ల వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.
  • తాజాగా ఎకోపార్క్ సమీపంలో బైక్ ఢీకొనడంతో మల్లెబోయినపల్లికి చెందిన గోపాల్ మరణించారు.