మ‌హారాష్ట్ర‌ ధారాశివ్ జిల్లా య‌ద్షి గ్రామంలో దీపావ‌ళి పండుగ పూట ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలోని ఆరుగురు గాఢనిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. బ‌య‌టికి వ‌చ్చేందుకు మా ర్గం లేక‌పోవ‌డంతో ఆరుగురూ స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. య‌ద్షి గ్రామానికి చెందిన 75 ఏళ్ల‌ ఉత్త‌మ్ ట్రింబాక్ ఇంట్లోనే కిరాణం దుకాణం న‌డుపుతున్నాడు. ఈ క్ర‌మంలో దీపావ‌ళి రాత్రి భోజ‌నం త‌ర్వాత ఎప్ప‌టిలాగే కుటుంబ‌స‌భ్యులంద‌రూ ఇంటిపైన ప‌డుకున్నారు. అర్ధ‌రాత్రి ఒక్క‌సారిగా కిరాణం దుకాణంలో మంట‌లు చెల‌రేగాయి. క్ర‌మంగా ఇంటికి కూడా మంట‌లు అంటుకున్నాయి. ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేందుకు దారిలేకుండా మంట‌లు ఎగిసిప‌డ్డాయి.

దాంతో ఉత్త‌మ్ ట్రింబాక్‌, అత‌ని భార్య చంద్ర‌క‌ళ (70), కుమారుడు గోవింద్ (47), కుమార్తె జ్యోతి (42), మ‌నుమ‌రాండ్లు గాయ‌త్రి (16), సిద్ధి (15) మంట‌ల్లో స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యారు. ప్ర‌మాదానికిగ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ లేదా కిరాణం స్టోర్‌లోని ఏదైనా మండే స్వ‌భావంగ‌ల ప‌దార్థంవ‌ల్ల జరిగి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.