ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మనకు ఇష్టమైన నటీనటులను చూస్తూ ఆనందించాము. కానీ, గూగుల్ ప్రతిపాదించిన సరికొత్త ఏఐ వ్యవస్థ అందుబాటులోకి వస్తే, ప్రేక్షకులే స్వయంగా తమకు ఇష్టమైన సినిమాలు, టీవీ షోలలో ప్రధాన పాత్రధారులుగా కనిపించే అవకాశం ఉంది. భారతీయ మూలాలున్న గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ప్రమీల కావ్య తుమ్మూరు, అరవింద్ రెడ్డి అయ్యలూరి ఈ సాంకేతికతకు రూపకల్పన చేశారు. టీవీ యాప్‌లో ‘మై ఛానెల్’ (My Channel) అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా ఈ ఏఐ వ్యవస్థ పనిచేస్తుంది.


మీ ముఖం, మీ గొంతుతోనే వీడియోలు. వినియోగదారుల ఫోటోలు, వీడియోల ఆధారంగా వారి డిజిటల్ అవతార్‌ను సృష్టించడమే కాకుండా, వారి వాయిస్ రికార్డింగ్‌లను ఉపయోగించి వారి గొంతుతోనే డైలాగులు చెప్పించేలా ఏఐ పనిచేస్తుంది. ఆసక్తులకు అనుగుణంగా కథలు. యూజర్ల యూట్యూబ్ వాచ్ హిస్టరీ, ఇష్టమైన జానర్లు (కామెడీ, రొమాన్స్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్), భాష, వయసు, ప్రాంతం ఆధారంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సరికొత్త కథలను సిద్ధం చేస్తుంది. ఉదాహరణకు, మీరు క్రికెట్ వీడియోలు ఎక్కువగా చూస్తే, స్టేడియంలో మీ అభిమాన ఆటగాడితో కలిసి ఉన్నట్లు లేదా భారత్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నట్లు ఏఐ వీడియోను రూపొందిస్తుంది. 24/7 వ్యక్తిగత ఛానెల్ & ప్రకటనలు. వారానికోసారి, నెలకోసారి లేదా కోరుకున్నప్పుడల్లా కొత్త ఎపిసోడ్లను ఆటోమేటిక్‌గా సృష్టిస్తూ, ప్రతి యూజర్‌కు 24 గంటల పాటు నడిచే వ్యక్తిగత వినోద ఛానెల్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, వీక్షకుడి ఆసక్తులకు తగినట్లుగా కస్టమైజ్డ్ ప్రకటనలను కూడా ఇందులో జతచేస్తుంది.