ఒక దేశం సంక్షోభం నుంచి అభివృద్ధి వైపు ఎలా కోలుకోవచ్చో రువాండా ప్రయాణం తెలియజేస్తోంది.ఒకప్పుడు జాతి విద్వేషంతో రక్తసిక్తమైన దేశం.. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషాద భూమి.. కానీ నేడు అదే దేశం ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. యుద్ధం, పేదరికం, విధ్వంసం నుంచి బయటపడి సాంకేతికత, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, మౌలిక సదుపాయాల రంగాల్లో దూసుకుపోతోంది. 1994 100 రోజుల్లోనే 8 లక్షల మందికి పైగా ప్రజలు హత్యకు గురయ్యారు. తర్వాత పాల్ కగామే నాయకత్వంలోని రువాండా పేట్రియాటిక్ ఫ్రంట్ దేశంలో అధికారాన్ని చేపట్టింది. అనంతరం దేశ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
జాతి ఆధారిత విభజనను తగ్గించి జాతీయ ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. అవినీతిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది.ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచింది.మహిళలకు రాజకీయాలు, ప్రభుత్వ రంగాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించింది. 2025లో 9.4 శాతం వృద్ధి ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది.
రువాండా రాజధాని కిగాలి నగరం దేశ అభివృద్ధికి ప్రతీకగా మారింది. ఒకప్పుడు అంతర్యుద్ధంతో అతలాకుతలమైన ఈ నగరం నేడు ఆధునిక రహదారులు, పరిశుభ్రమైన వీధులు, అంతర్జాతీయ సమావేశ కేంద్రాలు, ఆధునిక భవనాలతో ఆకట్టుకుంది. ప్లాస్టిక్ సంచుల వినియోగంపై కఠినమైన ఆంక్షలు విధించడం, ప్రతి నెలా నిర్వహించే సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమం 'ఉముగాండా' వంటి చర్యలు దేశ పరిశుభ్రతకు దోహదపడ్డాయి.
రువాండా అభివృద్ధిలో సేవల రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తున్నాయి. రువాండా అభివృద్ధిలో మహిళల పాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పార్లమెంట్లో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించిన దేశాల్లో రువాండా ఒకటి. రాజకీయాలు, విద్య, వ్యాపారం, ప్రభుత్వ రంగాల్లో మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
1994లో మారణహోమంతో ప్రపంచాన్ని కలచివేసిన రువాండా.. నేడు ఆఫ్రికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఎదిగింది. కేవలం మూడు దశాబ్దాల్లోనే ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించుకుని, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంది.అయితే రువాండా కథ కేవలం ఆర్థిక వృద్ధి కథ మాత్రమే కాదు. జాతీయ ఐక్యత, పునర్నిర్మాణం, ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో తెలియజేసే ప్రయాణం కూడా.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!