ఆదిలాబాద్ : ఉట్నూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏజెన్సీ, మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రెండు విధాలుగా ముఖ్యమైన చర్యలు చేపట్టారు. ఒకవైపు ఆసుపత్రికి అవసరమైన ఆధునిక వైద్య పరికరాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తులను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆసుపత్రి పనితీరును నేరుగా సమీక్షించేందుకు శుక్రవారం "మీ అభిప్రాయం - మెరుగైన వైద్య సేవలకు బాట" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆధునిక వైద్య పరికరాల మంజూరుకు మంత్రి సానుకూలత:
ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మారుమూల గిరిజన ప్రాంతాల పేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆర్థోపెడిక్, గైనకాలజీ (ప్రసూతి), కంటి వైద్యం, జనరల్, దంత వైద్య విభాగాల్లో ఆధునిక పరికరాలు అత్యవసరమని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు సానుకూలంగా స్పందించి, అవసరమైన అన్ని వైద్య పరికరాల మంజూరుకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సమస్యలు, సూచనల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్:
ఆసుపత్రిలో ప్రస్తుత సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రారంభించిన ప్రజా సంపర్క కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న చికిత్స, పారిశుధ్యం, వైద్యులు మరియు సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు తమ అనుభవాలు, సమస్యలు, సూచనలను 82971 87229 వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ ద్వారా పంపాలని కోరారు. అభిప్రాయాలు లేదా ఫిర్యాదులు పంపిన వారి వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, వచ్చిన సూచనల ఆధారంగా ఆసుపత్రిలో వసతులు, పారిశుధ్య వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!