ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 100 శాతం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. శుక్రవారం కేస్లాపూర్ గ్రామ ప్రజలతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు.

కేస్లాపూర్ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించిన ఎమ్మెల్యే:

గోండు, పర్ధాన్ గిరిజనుల పవిత్ర నాగోబా జాతరకు ప్రసిద్ధి చెందిన కేస్లాపూర్ గ్రామానికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మెస్రం వంశస్థులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఎమ్మెల్యే మంత్రులకు వివరించారు. ఈ గ్రామానికి ప్రత్యేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని తెలియజేశారు. గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పేద గిరిజన కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రులను కోరారు.