ముంబై రొమాంటిక్ డ్రామాల నుండి హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాల వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ అమెరికన్ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ 'వెరైటీ' విడుదల చేసిన 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో షారుఖ్ ఖాన్ 92వ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన తారలతో కూడిన ఈ జాబితాలో చోటు సంపాదించిన ఏకైక భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం.
ఈ జాబితాలో హాలీవుడ్ దిగ్గజం మార్లిన్ మన్రో మొదటి స్థానంలో నిలవగా, హంఫ్రీ బోగార్ట్, చార్లీ చాప్లిన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. జీవించి ఉన్న తారలలో జాక్ నికల్సన్ 4వ స్థానంతో అత్యున్నత ర్యాంక్ సాధించారు. ఇక నాలుగు దశాబ్దాల పాటు 90కి పైగా చిత్రాలలో నటించిన షారుఖ్ ఖాన్ కెరీర్‌కు నిదర్శనంగా 2002లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ చిత్రాన్ని తప్పక చూడాల్సిన సినిమాగా వెరైటీ ఎంపిక చేసింది. 'బాజీగర్', 'డర్' చిత్రాల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో మొదలుపెట్టి, 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే', 'దేవదాస్' వంటి సినిమాలతో రొమాంటిక్ హీరోగా ఎదిగి, ఇటీవల 'పఠాన్', 'జవాన్' చిత్రాలతో యాక్షన్ హీరోగా మారిన తీరును మ్యాగజైన్ ప్రశంసించింది. హాలీవుడ్ స్టార్ల కంటే ముందు వరుసలో.. 92వ ర్యాంక్ సాధించడం ద్వారా షారుఖ్ ఖాన్ ఆస్కార్ విజేత ఎమ్మా స్టోన్ (94), జెండయా (98), సిల్వెస్టర్ స్టాలోన్ (99) వంటి ప్రముఖ హాలీవుడ్ తారల కంటే ముందు నిలిచారు. కేట్ విన్స్లెట్ (84), తిమోతీ చాలమెట్ (86), నికోలస్ కేజ్ (89), జోక్విన్ ఫీనిక్స్ (93) వంటి అంతర్జాతీయ తారల సరసన చోటు సంపాదించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!