డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు కలిగించే మందులను విక్రయిస్తున్న మెడికల్ షాప్‌పై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ వింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గ్రామంలోని వెంకటేశ్వర మెడికల్ & జనరల్ స్టోర్‌పై నవంబర్ 19న పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దుకాణంలో కోడైన్ కలిగిన దగ్గు సిరప్లు, క్లోనాజెపామ్ మాత్రలను అక్రమంగా దారి మళ్లిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడి చేశారు. తనిఖీల సమయంలో రిజిస్టర్డ్ వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. 1945 డ్రగ్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బిల్లులు ఇవ్వకుండా, తప్పనిసరిగా నిర్వహించాల్సిన షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్‌ను నిర్వహించకుండానే వీటిని విక్రయిస్తున్నట్లు తేలింది.
ఈ దాడిలో ట్రిప్రోలిడిన్ హైడ్రోక్లోరైడ్, కోడైన్ ఫాస్ఫేట్ కలిగిన 'టాసెక్స్ సిరప్' మరియు ఎస్కిటాలోప్రమ్ ఆక్సలేట్, క్లోనాజెపామ్ కలిగిన 'కోజెపామ్ ప్లస్' మాత్రల నిల్వలతో పాటు కొనుగోలు ఇన్వాయిస్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోడైన్ సిరప్లు షెడ్యూల్ H1 కిందకు, క్లోనాజెపామ్ మాత్రలు షెడ్యూల్ H కిందకు వస్తాయని టీజీ సేఫ్ అధికారులు తెలిపారు. ఇవి రెండూ వ్యసనానికి దారితీసే మందులని, వీటిని విచ్చలవిడిగా వాడటం వల్ల మత్తుకు బానిసవ్వడంతో పాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. అరవింద్ కుమార్ పర్యవేక్షణలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వి. ఉపేందర్, వరంగల్ పోలీసు సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం నిందితులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!