పెళ్లి కంటే చదువే తన భవిష్యత్తుకు ముఖ్యమని భావించి, తనకు జరగబోయిన బాల్య వివాహాన్ని ధైర్యంగా అడ్డుకున్న మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాకు చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక హీమా నినామా ఇప్పుడు ప్రపంచ వేదికపై ప్రశంసలు అందుకుంటోంది. ఝాబువాలోని ప్రభుత్వ సందీపని విద్యాలయలో చదువుతున్న హీమా, ప్రతిరోజూ తన ఇంటి నుండి పొలాల మధ్యలో ఉన్న మట్టి దారిలో చాలా దూరం నడిచి వెళ్లి స్కూల్ బస్సు ఎక్కుతుంది. ఆమె 11వ తరగతి చదువుతున్న సమయంలో తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి నిశ్చయించారు. తన వివాహాన్ని ఆపాలని నిర్ణయించుకున్న హీమా, నేరుగా పాఠశాలకు వెళ్లి తన ఉపాధ్యాయులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఉపాధ్యాయులు హీమా తల్లిదండ్రులను కలిసి, బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, ఇప్పుడు ఆమె చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయమని నచ్చజెప్పడంతో పెళ్లి రద్దయింది. 


ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న హీమా, పాఠశాలలో అందిస్తున్న 'కెరీర్ గైడెన్స్' కార్యక్రమాల ద్వారా భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన పెంచుకుంది. చదువుతో పాటు షాట్‌పుట్, పరుగు పందెం పోటీల్లోనూ పతకాలు సాధించింది. "నేను టీచర్ కావాలనే నా పెళ్లిని ఆపుకున్నాను. అమ్మాయిలు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి" అని హీమా తన వీడియోలో పేర్కొంది. యునిసెఫ్ ‘చూజ్ ఎ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్’ (Choose a future for children) ప్రచారంలో భాగంగా హీమా స్ఫూర్తిదాయక ప్రయాణంపై రూపొందించిన ఈ ప్రత్యేక వీడియోను అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్‌హామ్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆమె ధైర్యాన్ని కొనియాడారు.