మహిళలు, ముఖ్యంగా వివాహ సమయంలో వధువుల వస్త్రధారణపై అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు, అమౌర్ ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఒక బహిరంగ సభలో ఆయన ముస్లిం వివాహాల్లో జరుగుతున్న సంప్రదాయాలపై మాట్లాడుతూ జుగుప్సాకరమైన భాషను ఉపయోగించారు.

అతిథుల ముందు వధువు ముఖాన్ని చూపించే 'ముహ్ దిఖాయి' ఆచారాన్ని బహిరంగంగా కూర్చునే 'తవాయిఫ్' (వేశ్య)తో పోల్చడంతో పాటు, పరదా లేకుండా కూర్చున్న వధువులను పురుషులు చూడటాన్ని పందుల లక్షణంగా అభివర్ణించారు. ‘‘నేను మా పురుషులను ఒకటే అడగాలనుకుంటున్నాను, మీకు సిగ్గు, శరం ఏమైనా ఉందా? ఇలా విచ్చలవిడిగా కలిసి తిరగడం పందుల లక్షణం. ఈ రోజుల్లో తలపై చున్నీ వేసుకునే మహిళల కంటే, టోపీలు ధరించే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇస్లాంలో మహిళలకు పరదా తప్పనిసరి’’ అని ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ అఖ్తరుల్ ఇమాన్ వెనక్కి తగ్గలేదు. పెళ్లైన హిందూ మహిళలకు సిందూరం కంటే ముస్లిం మహిళలకు పరదా ఎంతో ముఖ్యమని, తన మాటలు మొండికేసే పిల్లాడికి కొట్టే చెంప దెబ్బ లాంటివని ఆయన సమర్థించుకున్నారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు.