హైదరాబాద్: బరువు తగ్గాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని, ఊబకాయం తగ్గించే పేరుతో ప్రమాదకరమైన ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు రట్టు చేశారు.పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఇంజెక్షన్లను ఈ ముఠా ‘రీసెర్చ్ పెప్టైడ్’ పేరుతో సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా దేశవ్యాప్తంగా కొరియర్ సర్వీసుల సాయంతో వీటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు.భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేని ఇలాంటి ప్రయోగాత్మక ఇంజెక్షన్లను వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడటం వల్ల గుండె, మూత్రపిండాల (కిడ్నీ) పనితీరుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, మోసపోవద్దని హైదరాబాద్ పోలీసులు సూచించారు.