తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28న కొండపై ఉన్న సంప్రదాయ దీపస్తంభం (దీపథూన్‌) వద్ద తప్పనిసరిగా దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టు బోర్డును సస్పెండ్ చేయడంతో పాటు, ఆలయ నిర్వహణ బాధ్యతలను ఇద్దరు మాజీ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీకి అప్పగించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనపై తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టీలకు ధిక్కరణ నోటీసులు కూడా జారీ చేసింది.

దీపస్తంభం వద్ద దీపం వెలిగించాల్సిందే

ఈ వివాదంపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలి ధర్మాసనం.. నవంబర్ 28న దీపస్తంభం వద్ద సంప్రదాయ దీపం వెలిగించాలని ఆదేశించింది. గతంలో ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద వెలిగించిన జ్యోతి అందుబాటులో ఉంటే దానిని ఉపయోగించాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీపస్తంభం చుట్టుపక్కల సికందర్ దర్గాకు అన్ని వైపులా కనీసం 50 మీటర్ల దూరం పాటిస్తూ భక్తులు దీపం వెలిగించేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. ఆలయం, దర్గాకు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు (సీఆర్‌పీఎఫ్‌) భద్రత కల్పించాలని సూచించింది. దర్గాకు రక్షణ కల్పించేందుకు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఆలయ ట్రస్టు బోర్డు సస్పెన్షన్

గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఆలయ ట్రస్టు బోర్డు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను తమకు అనుకూలంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడంతో పాటు, వాటి అమలును అడ్డుకునేలా తీర్మానం చేసినట్లు ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ ట్రస్టు బోర్డును సస్పెండ్ చేసింది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌లతో కూడిన కమిటీని రిసీవర్లుగా నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడటం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా పేర్కొంది.

తమిళనాడు అధికారులకు ధిక్కరణ నోటీసులు

ఈ నెల 20న దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తమిళనాడు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముఖ్యంగా మదురై జిల్లాలో పరిపాలనా గందరగోళం నెలకొందని అసహనం వ్యక్తం చేసింది. అధికారులు రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు వ్యవహరించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొంది. కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆలయ ట్రస్టీలకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో తిరుప్పరంకుండ్రం దీపం వివాదం మరో కీలక మలుపు తిరిగింది. నవంబర్ 28న దీపస్తంభం వద్ద దీపం వెలిగించే కార్యక్రమం ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.