న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల ఆమోదంపై పార్లమెంట్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు అధికార ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తుండగా, డీఎంకే, ఎన్సీపీ పార్టీల వైఖరిపై ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 319 మంది ఎంపీల మద్దతు అందుబాటులో ఉన్నట్లు అంచనా. డీఎంకే, ఎన్సీపీ పార్టీలు కూడా సానుకూలంగా స్పందిస్తే బిల్లుకు అనుకూలంగా ఉండే ఎంపీల సంఖ్య 353కు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బిల్లు ఆమోదానికి అవసరమైన 360 ఓట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో ఏడు ఓట్లు అవసరమవుతాయి.

నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకుండా రక్షణ కల్పించాలని డీఎంకే పట్టుబడుతోంది. మరోవైపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదన ఉంటే మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఎన్సీపీ నేత సుప్రియా సూలే సూచించినట్లు సమాచారం.