హైదరాబాద్: ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన మానవ విషాదాల్లో రువాండా మారణహోమం ఒకటి. 1994లో కేవలం 100 రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జాతి విద్వేషాలు, రాజకీయ కుట్రలు, తీవ్రవాద ప్రచారం కలిసి ఒక దేశాన్ని రక్తసిక్తం చేశాయి. ఆఫ్రికా ఖండంలోని చిన్న దేశమైన రువాండాలో ప్రధానంగా హుటు , టుట్సీ అనే రెండు సామాజిక వర్గాలు ఉన్నాయి. రాజకీయ ఆధిపత్యం, అధికార పోరాటం, జాతి విద్వేషాలు ఈ వర్గాల మధ్య విభేదాలు.1994 ఏప్రిల్ 6న అప్పటి రువాండా అధ్యక్షుడు జువెనాల్ హబ్యారిమానా ప్రయాణిస్తున్న విమానం కిగాలీ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో ఆయన మరణించారు. కొన్ని రేడియో కేంద్రాలు టుట్సీ వర్గానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత సందేశాలను ప్రసారం చేశాయి. ప్రజలను హింసకు ప్రేరేపించాయి.కత్తులు, తుపాకులు, ఇతర మారణాయుధాలతో సామాన్య ప్రజలపై దాడులు జరిగాయి. గ్రామాలు, పట్టణాలు రక్తసిక్తమయ్యాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా వేలాది మందిని హతమార్చారు.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం సుమారు 8 లక్షల మంది ఈ మారణహోమంలో ప్రాణాలు కోల్పోయారు. కొన్ని అంచనాల్లో ఈ సంఖ్య 10 లక్షల వరకు ఉంది.తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత ప్రసంగాలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన ప్రపంచానికి తెలియజేసింది.అధికారం కోసం రాజకీయ నాయకులు రెచ్చగొట్టే విద్వేషాలు, తప్పుడు ప్రచారాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఒక దేశాన్ని ఎలా నాశనం చేయగలవో రువాండా మారణహోమం ప్రపంచానికి గట్టి హెచ్చరికగా నిలిచింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!