ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పోషక విలువలకు సంబంధించిన హెచ్చరికలను అత్యంత స్పష్టంగా ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

అధిక మోతాదులో కొవ్వు, చక్కెర మరియు ఉప్పు కలిగిన ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ల ముందు భాగంలో విడివిడిగా ఎరుపు రంగు షడ్భుజి గుర్తులతో హెచ్చరికలను చూపించాలని ధర్మాసనం సూచించింది. ముఖ్యంగా ప్రతి ప్యాకెట్ ముందు భాగంలో 'HIGH FAT' (అధిక కొవ్వు), 'HIGH SUGAR' (అధిక చక్కెర), 'HIGH SALT' (అధిక ఉప్పు) అనే పదాలు వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ఉండాలని పేర్కొంది.వినియోగదారులు మార్కెట్లో ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో వాటిలో ఉన్న హానికరమైన స్థాయులను సులభంగా గుర్తించి, ఆరోగ్యపరమైన అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల జీవనశైలి వ్యాధులు, ఊబకాయం వంటి సమస్యలను నియంత్రించవచ్చని పేర్కొంది.