హైదరాబాద్: చలికాలం ప్రారంభం కావడంతో హైదరాబాద్ వీకెండ్ సందడి మళ్లీ ఆరుబయట పచ్చిక బయళ్లకు మారుతోంది. ఇందులో భాగంగా నగరంలోని అతిపెద్ద వింటర్ ఫ్లీ మార్కెట్ ‘లా లా ల్యాండ్ ఫ్లీ’ (La La Land Flea) తన 9వ ఎడిషన్ (సీజన్ 9)తో డిసెంబర్ 6, 2026 (ఆదివారం) నాడు ఇజ్జత్‌నగర్‌లోని హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్‌లో సందడి చేయనుంది. ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు 12 గంటల పాటు ఈ వేడుక కొనసాగనుంది. గత ఎనిమిది సీజన్లలో 70,000 మందికి పైగా సందర్శకులను, 2,000కు పైగా బ్రాండ్‌లను ఆకర్షించిన ఈ ఫెస్టివల్, పగటిపూట షాపింగ్ బజార్ మరియు రాత్రిపూట లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కలయికగా అలరించనుంది.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఫ్యూజన్ మ్యూజిక్ బ్యాండ్ 'క్యాప్రిసియో' ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలుగు మెలోడీలు, బాలీవుడ్ హిట్లు, పాప్-రాక్ సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనుంది.
బాలీవుడ్ బ్యాండ్ & ఓపెన్ మైక్: సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముంబై/అవుట్‌స్టేషన్ నుండి వచ్చే సర్‌ప్రైజ్ బాలీవుడ్ బ్యాండ్ కనువిందు చేయనుంది. వీటితో పాటు స్థానిక గాయకులు, కళాకారుల కోసం 'ఓపెన్ మైక్', ప్రేక్షకులందరూ కలిసి పాడుకునే 'లైవ్ జామింగ్' సెషన్లు ఉంటాయి.


డిసెంబర్ పెళ్లిళ్లు, ఏడాది చివరి బహుమతుల సీజన్‌కు అనుగుణంగా 150కి పైగా స్వదేశీ బ్రాండ్లు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. స్లో-ఫ్యాషన్ వింటర్ వేర్, హస్తకళా పాదరక్షలు, వెండి మరియు పూసల ఆభరణాలు, సిరామిక్స్, హోమ్ డెకర్ వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక ఆహార ప్రియుల కోసం 50కి పైగా క్యూరేటెడ్ ఫుడ్ స్టాళ్లు, కేఫ్‌లు సిద్ధమవుతున్నాయి. గ్లోబల్ ఫ్యూజన్ స్ట్రీట్ ఫుడ్, గౌర్మెట్ బర్గర్లు, వుడ్-ఫైర్డ్ పిజ్జాలు, స్థానిక వంటకాలు, బేకరీ ఐటమ్స్, క్రాఫ్ట్ కాఫీ మరియు మాక్‌టెయిల్ బార్లు ఇక్కడ కొలువుదీరనున్నాయి. పెద్దలు, పిల్లల కోసం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి డీఐవై వర్క్‌షాప్‌లు ఉంటాయి. పిల్లల కోసం ట్రామ్పోలిన్, కార్నివాల్ గేమ్స్‌తో ప్రత్యేక 'కిడ్స్ జోన్' ఏర్పాటు చేశారు. హైటెక్స్ పచ్చిక బయళ్లలో జరిగే ఈ వేడుక పూర్తిగా పెట్-ఫ్రెండ్లీగా ఉంటుంది. సందర్శకులు తమ పెంపుడు జంతువులను ఎలాంటి ప్రత్యేక పాస్ లేకుండానే వెంట తీసుకురావచ్చు.

తేదీ, వేదిక & టికెట్ వివరాలు:

తేదీ & సమయం: డిసెంబర్ 6, 2026 (ఆదివారం) | ఉదయం 11:00 నుండి రాత్రి 11:00 వరకు.
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, ట్రేడ్ ఫెయిర్ ఆఫీస్ బిల్డింగ్, ఇజ్జత్‌నగర్, కొత్తగూడ, హైదరాబాద్.
టికెట్ ధరలు: సింగిల్ ఎంట్రీ రూ. 399 (ఎర్లీ బర్డ్ పాస్‌లు రూ. 249 నుండి ప్రారంభం), ఇద్దరికి గ్రూప్ పాస్ రూ. 749, నలుగురికి రూ. 1,399. 10 ఏళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. ప్రవేశ ద్వారం వద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్) చూపించడం తప్పనిసరి.