ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రి గ్రామంలో జరిగిన పరువు హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మేనత్త కుమారుడిని ప్రేమించిందనే ఆగ్రహంతో కన్నతండ్రే తన 18 ఏళ్ల కుమార్తె కల్యాణిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మీడియా సమావేశంలో వెల్లడించారు.

నిశ్చితార్థానికి ముందే దారుణం:

ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్ కుమార్తె కల్యాణికి ఈ నెల 25న నార్నూర్‌కు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే, ఈ నెల 23న కల్యాణి దిగులుగా ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను గట్టిగా నిలదీశారు. తనకు మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉన్నట్లు కల్యాణి తండ్రికి తెలిపింది. కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తండ్రి కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురై, కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో మంగళవారం వేకువజామున కల్యాణి గొంతు నులిమి హత్య చేశాడు.

హడావుడి అంత్యక్రియలతో వీడిన మిస్టరీ:

హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను సైతం కైలాస్ నమ్మించాడు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేస్తూ, కల్యాణి మృతిచెందిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీంతో గ్రామస్తులకు అనుమానాలు తలెత్తి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన నార్నూర్ సీఐ గురుస్వామి ఆధ్వర్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పరువు పోతుందనే కారణంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు తండ్రి కైలాస్ నేరం అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.