పాకిస్థానీ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమైట్ లో’ విడుదలకు ముందు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్‌లో రూపొందిన ఎలాంటి కంటెంట్‌ను భారతదేశంలో స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పాకిస్థానీ వెబ్ సిరీస్ ‘జో బచే హై సంగ్ సమైట్ లో’ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉందంటూ మంత్రిత్వ శాఖకు పలు ఫిర్యాదులు, వినతులు అందాయి. దీనిపై స్పందించిన కేంద్రం, 2025 మే 8న జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. గత ఏడాది జూన్‌లో నెట్‌ఫ్లిక్స్ స్పందిస్తూ, పాకిస్థాన్ మూలాలున్న ఏ సినిమా లేదా సిరీస్‌ను భారత సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంచలేదని మంత్రిత్వ శాఖకు హామీ ఇచ్చింది. ఆనాడు ఇచ్చిన మాటపైనే నిలబడాలని కేంద్రం తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు గుర్తు చేసింది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
అంతర్జాతీయంగా ‘ఆల్ ది లవ్ అవర్ హార్ట్స్ క్యారీ’ పేరుతో ప్రచారం పొందుతున్న ఈ సిరీస్, నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొలి పాకిస్థానీ ఒరిజినల్ సిరీస్. పాకిస్థాన్ రచయిత్రి ఫర్హత్ ఇష్తియాక్ రాసిన ప్రముఖ ఉర్దూ నవల ఆధారంగా రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్, సనమ్ సయీద్, అహద్ రజా మీర్, హనియా ఆమిర్, హంజా అలీ అబ్బాసీ, ఇక్రా అజీజ్, మాయా అలీ, బిలాల్ అష్రఫ్ వంటి ప్రముఖ నటులు నటించారు. మోమినా దురైద్ నిర్మించిన ఈ సిరీస్ 2026 డిసెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!